Telangana: రేపు ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు హాజరు

ts minister malla reddy son and niece will attend it enquiry tomorrow
  • మెడికల్ సీట్లను అమ్ముకున్నారంటూ మల్లారెడ్డిపై ఆరోపణలు
  • మంత్రి ఇల్లు, కార్యాలయాల్లో ఇదివరకే జరిగిన సోదాలు
  • మంగళవారం రెండో రోజు కొనసాగిన ఐటీ అధికారుల విచారణ
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. మెడికల్ సీట్లను అక్రమంగా అమ్ముకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ దాడులు జరగగా.... గడచిన రెండు రోజులుగా ఈ వ్యవహారంపై ఐటీ అధికారులు విచారణ సాగిస్తున్నారు. విచారణలో రెండో రోజైన మంగళవారం మల్లారెడ్డి విద్యా సంస్థలకు చెందిన ప్రిన్నిపల్ లు, డైరెక్టర్లు ఐటీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ సీట్ల కేటాయింపుతో మొదలుపెట్టి.... ఆయా విద్యార్థులు చెల్లించిన ఫీజుల వివరాలపై అధికారులు ఆరా తీశారు.

మంగళవారం ఉదయం మొదలైన ఈ విచారణ సాయంత్రం దాకా కొనసాగింది. ఈ కేసులో రెండో రోజు విచారణ ముగిసిందని ఐటీ శాఖ ప్రకటించింది. మరోవైపు రేపు (బుధవారం) జరగనున్న మూడో రోజు విచారణకు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ మేరకు వారిద్దరికీ ఇదివరకే ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ అధికారుల విచారణకు మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు హాజరవుతున్న నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి వివరాలు బయటకు వస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.
Telangana
TRS
Ch Malla Reddy
IT Raids
Malla Reddy Institutions

More Telugu News