Qatar: ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న ఖతార్ జట్టు
- గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన తొలి ఆతిథ్య దేశంగా చిత్త రికార్డు
- మూడింటిలో ఒక్క గోల్ కూడా కొట్టని వైనం
- ఖతార్ జట్టును ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన నెదర్లాండ్స్
వేల కోట్లు ఖర్చు చేసి ఫుట్ బాల్ ప్రపంచకప్ నకు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ ఆటలో తీవ్రంగా నిరాశ పరిచింది. ఆతిథ్య దేశం హోదాలో తొలిసారి ఫిఫా ప్రపంచ కప్ లో పాల్గొన్న ఖతార్ గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ లో కూడా నెగ్గలేకపోయింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఖతార్ ఫిఫా వరల్డ్ కప్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టుగా నిలిచింది. ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి వైదొలిగిన ఆ జట్టు గ్రూప్–ఎ లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 0–2తో నెదర్లాండ్స్ చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్ లో ఖతార్‌ను ఓడించిన నెదర్లాండ్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
కొడి గప్కో 26వ నిమిషంలో డచ్ టీమ్‌కు తొలి అందించాడు. ఆపై, రెండో అర్ధ భాగం మొదలైన వెంటనే ఫ్రెంకీ డి జాంగ్ (49వ నిమిషం) మరో గోల్ కొట్టాడు. దాంతో, రెండు విజయాలు, ఓ డ్రాతో 7 పాయింట్లు సాధించిన డచ్ జట్టు గ్రూప్–ఎ లో అగ్రస్థానంతో నాకౌట్ చేరుకుంది. మరోవైపు వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిన తొలి ఆతిథ్య దేశంగా ఖతార్ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. మూడు మ్యాచ్ ల్లోనూ ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం గమనార్హం. దాంతో, పాయింట్ల ఖాతా తెరవకుండా టోర్నీ నుంచి నిష్ర్కమించిన జట్టుగానూ అపకీర్తి మూటగట్టుకుంది.