Adinarayana Reddy: గుండెలో పోటు పొడిచి.. గుండెపోటుగా మార్చారు: ఆదినారాయణ రెడ్డి

Adinarayana Reddy demands Jagan to resign and quit politics
  • జగన్, కేసీఆర్ ఇద్దరూ ఒకేటేనన్న ఆదినారాయణ రెడ్డి
  • వివేకా హత్య కేసు విచారణ తెలంగాణలో జరిగినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని వ్యాఖ్య
  • ఈ కేసులో వైఎస్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారన్న ఆదిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో వైఎస్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారని... అందుకే ఏపీలో విచారణ సరిగా జరగలేదని ఆయన అన్నారు. వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు.

కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని... అక్కడ కూడా విచారణ సరిగా సాగదని చెప్పారు. తెలంగాణలో న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదని అన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒకటేనని... కాబట్టి తెలంగాణలో విచారించడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.  

ఆనాడు వివేకా హత్య కేసుపై చంద్రబాబు వేసిన సిట్ పై నమ్మకం లేదని, సీబీఐ చేత విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారని... ఇప్పుడు ఆ డిమాండ్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వివేకా గుండెలో పోటు పొడిచి, గుండెపోటుగా మార్చారని ఆరోపించారు. పక్కా ప్రణాళికతో వివేకాను హత్య చేసి కట్టుకథలు అల్లారని చెప్పారు. సీఎం పదవికి జగన్ రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని జగన్ కు మరో సారి అవకాశం ఇవ్వాలని ఆయన శ్నించారు.
Adinarayana Reddy
BJP
Jagan
YSRCP
YS Vivekananda Reddy
Murder
CBI
KCR
TRS

More Telugu News