Telangana: నూతన బోధనాసుపత్రులకు పోస్టుల కేటాయింపు... 3,897 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్

ts government allotted the posts to new medical colleges
  • వచ్చే ఏడాది ప్రారంభం కానున్న 9 బోధనాసుపత్రులు
  • ఒక్కో బోధనాసుపత్రికి 433 పోస్టుల కేటాయింపు
  • మొత్తంగా 3,897 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
తెలంగాణలో 9 జిల్లా కేంద్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న బోధనాసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేరకు పోస్టులను కేటాయిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బోధనాసుపత్రికి 433 పోస్టుల చొప్పున మొత్తంగా 3,897 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల్లో ఆయా బోధనాసుపత్రులతో పాటు వాటికి అనుబంధంగా ఏర్పాటు కానున్న ఆసుపత్రులకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. 

రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం అసిఫాబాద్, జనగాం, నిర్మల్ లలో వచ్చే ఏడాది బోధనాసుపత్రులను ప్రారంభించనున్నారు. వీటికి అవసరమైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ఇతరత్రా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం ఓ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణను మరింత పరిపుష్టం చేసేలా కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని, వాటికి అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నామని సదరు ట్వీట్ లో హరీశ్ రావు పేర్కొన్నారు.
Telangana
TRS
KCR
Harish Rao
Medical Colleges

More Telugu News