Andhra Pradesh: నా భార్యకు ఎలాంటి ఐటీ నోటీసులు రాలేదు: మంత్రి జయరాం
- రేణుకమ్మ పేరిట 30 ఎకరాల భూమి కొన్నట్లు ఐటీ నోలీసులు
- ఐటీ నోటీసులపై స్పందించిన మంత్రి జయరాం
- తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
ఒకే దఫా భారీ ఎత్తున భూములను కొనుగోలు చేశారంటూ తన భార్య రేణుకమ్మకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చిందంటూ వస్తున్న వార్తలపై ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా స్పందించారు. తన భార్యకు ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన తెలిపారు. తన భార్యకు ఐటీ నోటీసులు వచ్చాయంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు జారీ కాకుండానే... తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లా ఆస్పరిలో రేణుకమ్మ పేరిట జయరాం కుటుంబం రూ.52.42 లక్షలతో 30.83 ఎకరాలను కొనుగోలు చేసిందని, అయితే ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి లెక్కలు చెప్పడం లేదని ఆరోపిస్తూ రేణుకమ్మకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందంటూ గురువారం ఉదయం వార్తలు వినిపించాయి. ఒకే రోజున జయరాం భార్య, బంధువులు, సన్నిహితుల పేరిట 180 ఎకరాలు కొనుగోలు చేశారని, వాటిలో 30 ఎకరాలు రేణుకమ్మ పేరిట కొనుగోలు చేశారన్నది ఆ వార్తలోని ఆరోపణ. అయితే ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి నోటీసులు రాలేదంటూ జయరాం చెప్పడం గమనార్హం.