Huge Family: గుజరాత్ ఎన్నికల వేళ అందరినీ ఆకర్షిస్తున్న 'జంబో ఫ్యామిలీ'

Huge family attracts in Gujarat elections

  • గుజరాత్ లో నేడు పోలింగ్
  • కమ్రేజ్ లో ఓట్లు వేసిన సోలంకి కుటుంబం
  • సోలంకి కుటుంబంలో 81 మంది కుటుంబ సభ్యులు
  • వారిలో 60 మందికి ఓట్లు

దేశంలో గతంతో పోల్చితే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల సంఖ్య చాలా తగ్గిపోయింది. అన్నదమ్ముల మధ్య గొడవలు, తండ్రీకొడుకుల మధ్య గొడవలు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య గొడవలతో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కానీ, గుజరాత్ లోని సోలంకీ మహా కుటుంబం వాటన్నింటికి అతీతంగా నిలిచింది. 

ఈ ఉమ్మడి కుటుంబంలో 81 మంది ఉన్నారంటే నమ్మశక్యం కాదు. కమ్రేజ్ ప్రాంతానికి చెందిన ఈ జంబో ఫ్యామిలీ ఐకమత్యానికి, ఆప్యాయతానురాగాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాదు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అతి భారీ కుటుంబం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కుటుంబంలో 60 మంది ఓటర్లు ఉండడం విశేషం. అతిపెద్ద వయసు కలిగిన ఓటరు 82 ఏళ్ల శ్యామ్ జీ భాయ్ కాగా... అందరిలో చిన్న వయసున్న ఓటర్లు 18 ఏళ్ల పార్థ్, వేదాంత్ లే. 

నేడు గుజరాత్ లో ఎన్నికల పోలింగ్ కావడంతో సోలంకి కుటుంబ సభ్యులు అనేక వాహనాల్లో నవగ్రామ్ లోని పోలింగ్ బూత్ కు వెళ్లారు. దీనిపై ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఘనశ్యామ్ స్పందిస్తూ, తమ కుటుంబంలో పెళ్లికి అందరం ఎలా హాజరవుతామో, ఓటింగ్ ప్రక్రియలోనూ అంతే ఉత్సాహంతో పాల్గొంటామని చెప్పారు. 

ఈ కుటుంబం కమ్మరి పని చేస్తుంటుంది. వీరి స్వస్థలం బొటాద్ ప్రాంతంలోని లఖియాని గ్రామం కాగా, 1985లో వీరు సూరత్ లోని కమ్రేజ్ కు వలస వచ్చారు. ఇప్పటికీ ఈ కుటుంబానికి చెందిన 15 మంది లఖియానీ గ్రామంలో నివసిస్తున్నారు. వారందరితో కలిపితే ఈ కుటుంబంలోని వారి సంఖ్య 96 అని చెప్పుకోవాలి. ఈ జంబో ఫ్యామిలీ 'జ్యోతి' బ్రాండ్ పేరిట వ్యవసాయ పనిముట్లు తయారుచేస్తుంటుంది. 

ఇక, ఈ కుటుంబంలో ఆరు పదుల ఓట్లు ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయని వేరే చెప్పనక్కర్లేదు. అయితే, తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని, బలమైన దేశ నిర్మాణం కోసం తాము ఓటు వేస్తామని, అందరం కలిసి చర్చించుకుని ఒకే పార్టీకి ఓటు వేస్తామని ఆ కుటుంబానికి చెందిన భవేశ్ తెలిపారు. 

కాగా, ఈ కుటుంబంలోని వారు అత్యధికులు ఒకే ఇంట్లో ఉంటారు. కొందరు కుర్రవాళ్లు మాత్రం పెళ్లిళ్లు అయ్యాక ఇంట్లో స్థలం చాలకపోవడంతో వేరే ఇళ్లలో నివసిస్తున్నారట.

  • Loading...

More Telugu News