Telangana: ముగిసిన గంగుల సీబీఐ విచారణ... 9 గంటల పాటు ప్రశ్నల వర్షం
- నకిలీ సీబీఐ అధికారి వ్యవహారంలో విచారణకు హాజరైన గంగుల
- గంగులతో పాటు రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి కూడా హాజరు
- మరోమారు విచారణకు రావాలని తమను సీబీఐ కోరలేదన్న మంత్రి
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు వ్యవహారంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ గురువారం సీబీఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మంత్రి గంగులతో పాటు టీఆర్ఎస్ తరఫున ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గాయత్రి రవి కూడా ఇదే వ్యవహారంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ విచారణ గురువారం రాత్రి దాకా కొనసాగింది. వీరిద్దరినీ సీబీఐ అధికారులు 9 గంటల పాటు విచారించారు.
సీబీఐ విచారణ ముగిసిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్ పలు అంశాలను ప్రస్తావించారు. సీబీఐ అధికారుల ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పానని ఆయన తెలిపారు. తనను, గాయత్రి రవిని అధికారులు వేర్వేరుగానే విచారించారన్నారు. విచారణకు మళ్లీ రావాలని తమకేమీ చెప్పలేదని కూడా ఆయన తెలిపారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో తాము ఎలాంటి లావాదేవీలు జరపలేదని చెప్పామన్న కమలాకర్.... అదే విషయాన్ని సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్నారని తెలిపారు.