- భారత్ లోకి కొత్తగా 4 మోడళ్లు
- రేపటి నుంచి గోవాలో ఇండియా బైక్ వీక్
- హైఎండ్ సెగ్మెంట్లో అలరించనున్న బైకులు
కరోనా సంక్షోభ సమయంలో ఒడిదుడుకులు చవిచూసిన ద్విచక్రవాహన తయారీ సంస్థలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కొత్త మోడళ్లతో భారత మార్కెట్లో అమ్మకాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ డిసెంబరులో దేశీయ మార్కెట్లో నాలుగు కొత్త బైకులు రంగప్రవేశం చేయనున్నాయి. హీరో ఎక్స్ పల్స్ 200టీ 4వీ, రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 822సీసీ, హార్లే డేవిడ్సన్ నైట్ స్టర్, 2023 బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ మోడళ్లను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.
హీరో ఎక్స్ పల్స్ 200టీ 4వీ
ఎక్స్ పల్స్ శ్రేణిలో హీరో సంస్థ తీసుకువస్తున్న ఈ నూతన బైక్ ఆఫ్ రోడ్ సెగ్మెంట్ కు చెందినది. దీని ఎక్స్ షోరూం ధర రూ.1.35 లక్షలు ఉండొచ్చని అంచనా. ఈ బైక్ కు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు. ఇది పలు ఆకట్టుకునే రంగుల్లో లభ్యం కానుంది. ఇందులో రబ్బర్ ఫోర్క్ గెయిటర్స్, రెట్రో లుక్ అందించే హెడ్ ల్యాంప్ కౌల్ ను పొందుపరిచారు.
రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 822 సీసీ
రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీతనం ఉట్టిపడే ఈ మోటార్ సైకిళ్ల శ్రేణిలో కొత్త బైక్ వస్తోంది. డిసెంబరు 2, 3 తేదీల్లో గోవాలో జరిగే ఇండియా బైక్ వీక్-2022 కార్యక్రమంలో రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 822సీసీ బైకును ప్రదర్శించనున్నారు. ఇది 45 హెచ్ పీ కంటే అత్యధిక శక్తిని విడుదల చేస్తుంది. ఇందులో సిక్స్ స్పీడ్ ట్రాన్స్ మిషన్ అమర్చారు.
హార్లే డేవిడ్సన్ నైట్ స్టర్
స్టయిల్ ను కోరుకునేవారికి హార్లే డేవిడ్సన్ బైకులు ఎంతగానో నచ్చుతాయి. ఈ అంతర్జాతీయ దిగ్గజం గత కొంతకాలంగా భారత్ లో అమ్మకాల వృద్ధిపై దృష్టి పెట్టింది. తాజాగా తన నైట్ స్టర్ ను మోడల్ ను గోవాలో జరిగే ఇండియా బైక్ వీక్ లో ఆవిష్కరించనుంది. ఇందులో 975 సీసీ రివల్యూషన్ మ్యాక్స్ ఇంజిన్ పొందుపరిచారు. ఈ ఇంజిన్ 89 హెచ్ పీ పీక్ పవర్ అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14.99 లక్షలు (ఎక్స్ షోరూం ధర).
2023 బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ హైఎండ్ విభాగంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. రేసింగ్ బైకులకు పెట్టింది పేరైన బీఎండబ్ల్యూ తాజా మోడల్ ను ఇండయన్ బైక్ వీక్-2022లో ఆవిష్కరించనుంది. ఈ బైకు అప్ డేటెడ్ వెర్షన్ ను చివరిసారిగా 2019లో విడుదల చేసింది. ఇప్పుడా బైకును మరింత కొత్తగా ముస్తాబు చేసి భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది 209.38 పీఎస్ పీక్ పవర్ అందిస్తుంది. దీని ధర రూ.21 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.