Rivaba Jadeja: మా కుటుంబంలో ఎలాంటి గందరగోళం లేదు: జడేజా అర్ధాంగి రివాబా
- గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు
- జామ్ నగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్న రివాబా
- అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతగా జడేజా సోదరి
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్ధాంగి రివాబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఆమె జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, ఆమె వదిన నైనబా (రవీంద్ర జడేజా సోదరి) అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారకర్తగా ఉన్నారు. దాంతో రవీంద్ర జడేజా కుటుంబంలోని ఇతరులు నైనబాతో కలిసి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటున్నారు. రవీంద్ర జడేజా మాత్రం భార్య కోసం బీజేపీ ప్రచారంలో పాల్గొంటున్నాడు.
ఈ నేపథ్యంలో రివాబా స్పందించారు. తమ కుటుంబంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబంలోనే భిన్న సిద్ధాంతాలను అనుసరిస్తున్న వ్యక్తులు ఉండడం తనకేమీ కష్టంగా అనిపించడంలేదని రివాబా పేర్కొన్నారు. రివాబా తన ఓటు హక్కును రాజ్ కోట్ లో వినియోగించుకున్నారు.
అటు, రవీంద్ర జడేజా సోదరి నైనబా స్పందిస్తూ, తన సోదరుడి భార్య రివాబా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. ఆమె బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉందని తెలిపారు. జామ్ నగర్ నార్త్ నియోజకవర్గంలో రివాబా తమ ప్రత్యర్థి అయినంత మాత్రాన తన సోదరుడు రవీంద్ర జడేజాపై తన ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదని నైనబా వివరించారు.
కాగా, గుజరాత్ లో నేడు (డిసెంబరు 1) తొలి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి 56.88 శాతం సగటు ఓటింగ్ నమోదైంది 19 జిల్లాల్లో 89 స్థానాలకు నేడు ఎన్నికలు జరిపారు. రెండో దశ పోలింగ్ ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి.