KBC 14 Episode: కేబీసీలో రూ.12.5 లక్షలు గెలుచుకున్న పాన్ దుకాణం యజమాని
- ద్వారకాజిత్ మండలేను వరించిన భారీ బహుమతి
- అతడి ఐదు రోజుల సంపాదన రూ.1,000
- గేమ్ నుంచి నిష్క్రమించడంతో అమితాబ్ సంతృప్తి
చిన్న పాన్ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకునే ఓ సామాన్యుడు.. కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) 14 సీజన్ లో రూ.12.5 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నాడు. గురువారం రాత్రి ఈ ఎపిసోడ్ ప్రసారమైంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రూపంలో ద్వారకాజిత్ మండలే సెలక్ట్ అయ్యారు. ఆయనే పాన్ దుకాణం యజమాని.
పోటీదారుగా గేమ్ లోకి ఆయన్ని బిగ్ బీ అమితాబ్ ఆహ్వానించారు. మొదటగా రూ.1,000 ప్రశ్న సంధించే ముందు.. అది తన ఐదు రోజుల ఆదాయమని ద్వారకాజిత్ చెప్పాడు. ‘‘వెయ్యి రూపాయలు అన్నవి నాకు పెద్ద మొత్తం. ఒక్కసారి నా భార్యకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోవాలని చెప్పా. ఆమె కుటుంబానికి కావాల్సినవన్నీ కొనుగోలు చేసింది. కానీ, తనకోసం ఏమీ తీసుకోలేదు’’ అని అమితాబ్ తో చెప్పాడు.
ద్వారాకాజిత్ రూ.10,000 గెలుచుకున్నాడు. ‘‘ఐదు నిమిషాల్లో 50 రోజుల ఆదాయం గెలుచుకున్నావ్. అదే ఈ గేమ్ మ్యాజిక్’’ అని అమితాబ్ అన్నారు. ఈ బహుమతితో నీ చదువును పూర్తి చేస్తావా? అని అడగ్గా.. తానున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదంటూ, తన భార్య చదువుకోవాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపాడు. చివరికి ద్వారాకాజిత్ రూ.12,50,000 బహుమతితో గేమ్ నుంచి నిష్క్రమించడం అమితాబ్ ను మరింత సంతోషానికి గురిచేసింది.