Gadikota Srikanth Reddy: కర్నూలులో హైకోర్టు పెడితే రెండు టీ కొట్లు వస్తాయన్న చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు: ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
- రాయలసీమ అంటే చంద్రబాబుకు చులకన భావన అన్న శ్రీకాంత్‌రెడ్డి
- ఈ నెల 5న ‘చలో కర్నూలు’ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పిన ఎమ్మెల్యే
- కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాయలసీమ వాసులు ఏకం కావాలని పిలుపు
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే రెండు టీ దుకాణాలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగదన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యలను రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తప్పుబట్టారు. రాయలసీమ అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావనేనని అన్నారు. మేయర్ సురేశ్ బాబుతో కలిసి నిన్న కడపలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని, అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కర్నూలులో హైకోర్టు సాధనకు ఈ నెల 5న జేఏసీ ఆధ్వర్యంలో ‘రాయలసీమ గర్జన’ పేరుతో ‘చలో కర్నూలు’ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ నాయకులు కూడా గతంలో మద్దతునిచ్చారని ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు.
విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్ర వారంతా ఏకమయ్యారని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాయలసీమ ప్రజలు ఏకం కావాలని అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే మూడు రాజధానులు ఎజెండాగా ముందుకెళ్తోందని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.