google ceo: నేనెక్కడికి వెళ్లినా భారతదేశాన్ని నా వెంటే తీసుకెళ్తా.. అది నాలో ఓ భాగం: సుందర్ పిచాయ్
- 2022 ఏడాదికి గానూ సుందర్ కు పద్మ భూషణ్ ప్రకటించిన భారత్
- తాజాగా ఈ పురస్కారాన్ని సుందర్ కు అందించిన భారత రాయబారి
- భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన గూగుల్ సీఈవో
భారతదేశం తన శరీరంలో అంతర్భాగమని గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తన వెంట భారతదేశాన్ని తీసుకెళతానని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022 ఏడాదికిగానూ సుందర్ పిచాయ్ కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా.. అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ఈ అవార్డును సుందర్ పిచాయ్ కి అందజేశారు. భారత దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ను తనకు అందించడంపై సుందర్ పిచాయ్ భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను, తన ఎదుగుదలకు సహాయపడిన వారిని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.