Chandrababu: కోర్టు తప్పుబట్టినా అమరరాజాపై వీళ్ల తీరు మారలేదు: చంద్రబాబు
- తెలంగాణలో అమరరాజా పరిశ్రమ పట్ల స్పందించిన చంద్రబాబు
- గతంలో ఇచ్చిన భూములు వెనక్కి తీసుకున్నారని ఆరోపణ
- విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని విమర్శ
అమరరాజా గ్రూప్ తెలంగాణలోని మహబూబ్ నగర్ వద్ద రూ.9,500 కోట్లతో ఈవీ బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటు చేయనుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం కారణంగానే అమరరాజా వెళ్లిపోయిందని ఆరోపించారు.
నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన సంస్థ అమరరాజా అని తెలిపారు. 1 బిలియన్ డాలర్ కంపెనీ ఇప్పుడు సొంత రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ టెర్రరిజం కాదా? అని ప్రశ్నించారు.
"ఏపీలో పుట్టిన సంస్థ తొలిసారి చిత్తూరు వదిలి రాష్ట్రం వెలుపల రూ.9500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ప్రతిష్ఠాత్మక సంస్థను ప్రోత్సహించాల్సింది పోయి... గతంలో ఇచ్చిన భూములు కూడా వెనక్కి తీసుకున్నారు. పర్యావరణ అనుమతులు, తనిఖీల పేరుతో నిత్యం ఇబ్బంది పెట్టారు. ఉపాధినిచ్చే పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మీ శాడిజం చాటుకున్నారు. కోర్టు తప్పుపట్టినా మీ వైఖరి మార్చుకోలేదు. మీ రాజకీయ కక్షలతో ప్రజల ప్రయోజనాలనే కాదు, రాష్ట్ర ప్రతిష్ఠనే పణంగా పెట్టారు" అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఉద్యోగ ఉపాధి అవకాశాలను, ఆర్థిక వ్యవస్థను కాలరాయాలన్న లక్ష్యాన్ని వైసీపీ నెరవేర్చుకుంటోందని విమర్శించారు. కంపెనీలను ఆకర్షించడంలో రాష్ట్రాలు పోటీపడుతుంటే, ఏపీ మాత్రం కంపెనీలను సాగనంపుతూ పరమచెడ్డపేరు సంపాదించుకుంటోందని పేర్కొన్నారు. అనుమతులు నిరాకరించడం, దాడులు చేయడం వంటి కారణాలతో కంపెనీలు వెళ్లిపోయేందుకు కారణమవుతోందని వివరించారు.
రాజకీయ ప్రత్యర్థి అన్న కారణంతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల నమ్మకద్రోహానికి పాల్పడుతున్న జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హుడు కాడని స్పష్టం చేశారు. ఇలాంటి నరరూప రాక్షసుడిని చరిత్ర కూడా ఉపేక్షించదని పేర్కొన్నారు.