K Kavitha: లిక్కర్ స్కాంలో నోటీసులపై సీబీఐకి లేఖ రాసిన కవిత
- సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం
- కల్వకుంట్ల కవితపై ఆరోపణలు
- నోటీసులు జారీ చేసిన సీబీఐ
- ఈ నెల 6న విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపడం తెలిసిందే. నోటీసుల నేపథ్యంలో కవిత సీబీఐకి తాజాగా లేఖ రాశారు. ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని ఆమె సీబీఐని కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా వివరణ ఇచ్చేందుకు వీలవుతుందని కవిత పేర్కొన్నారు. తాను కోరిన మేరకు డాక్యుమెంట్లు అందజేస్తే, ఆపై విచారణ తేదీ ఖరారు చేయవచ్చని స్పష్టం చేశారు.
కాగా, ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొన్నారు. కవిత కోరుకున్న చోటే విచారణ చేస్తామని సీబీఐ వెసులుబాటు కల్పించడం తెలిసిందే. దాంతో, హైదరాబాదులోని తన నివాసంలో విచారణకు తనకు అభ్యంతరం లేదని కవిత సీబీఐకి బదులిచ్చారు.