Kakani Govardhan Reddy: వరి పండిస్తేనే రైతులన్న ఆలోచన నుంచి బయటకు రండి: మంత్రి కాకాణి
- అగ్రిటెక్ సదస్సును ప్రారంభించిన వ్యవసాయ మంత్రి కాకాణి
- అందరూ వరి పండిస్తే కొనడం కష్టమన్న మంత్రి
- ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచన
రైతులందరూ వరి పండిస్తే కొనడం కష్టమని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాం ఫాంలో నిన్న అగ్రిటెక్ సదస్సును ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వరి పండిస్తేనే రైతు, లేదంటే కాదన్న ఆలోచన నుంచి రైతు బయటకు రావాలని కోరారు. సీజన్‌కు తగ్గట్టుగా సాగునీరు సరఫరా చేస్తుండడంతో రైతులందరూ వరిని సాగుచేస్తున్నారని, కానీ ఈ పంటంతా కొనేందుకు ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వరి, మొక్కజొన్న వంగడాలను దేశంలోని 75 శాతం మంది రైతులు వినియోగిస్తున్నారన్న మంత్రి.. దీనికి కారకులైన శాస్త్రవేత్తలను అభినందించారు. రాష్ట్రంలో పత్తి సాగు పడిపోవడంతో తెలంగాణ నుంచి ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నామని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీని కోల్పోతోందన్నారు.
విద్యార్థుల్లో ఎక్కువమంది ఇంజినీరింగ్ చదవడంతో ఉద్యోగాలు ఇప్పించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారని, అయితే, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈపాటి పనికూడా చేయలేకపోతున్నారని తమను నిష్ఠూరమాడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి 10 పంటల్లో సేద్యం చేసేందుకు ప్రణాళిక రచించినట్టు చెప్పారు.