Vladimir Putin: ఇంట్లో జారిపడిన పుతిన్... అప్పుడేం జరిగిందంటే...!
- పుతిన్ ఆరోగ్య స్థితిపై ఇప్పుటికే ఎన్నో కథనాలు
- తాజాగా న్యూయార్క్ పోస్ట్ కథనం
- మెట్లపై నుంచి పడిన పుతిన్
- తనకు తెలియకుండానే మలవిసర్జన!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (70) ఆరోగ్యానికి సంబంధించిన అనేక కథనాలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. ఆయన ప్రాణాంతక క్యాన్సర్ తో బాధపడుతున్నారన్నది వాటిలో ప్రధానమైనది. తాజాగా పుతిన్ పై ఓ కథనం తెరపైకి వచ్చింది. ఓ టెలిగ్రామ్ చానల్ ను ఉటంకిస్తూ 'న్యూయార్క్ పోస్ట్' ఈ కథనం వెలువరించింది.
ఈ కథనం ప్రకారం... మాస్కోలోని తన అధికారిక నివాసంలో పుతిన్ జారిపడ్డారు. మెట్లు దిగుతుండగా ఆయన కాలు జారి కిందపడిపోయారు. అలా పడిపోవడంతో పుతిన్ అక్కడిక్కడే మల విసర్జన చేసేశారట. క్యాన్సర్ ప్రభావంతో పుతిన్ ఉదరం, పేగులు బలహీనపడ్డాయని, అందుకే తనకు తెలియకుండానే అసంకల్పితంగా మల విసర్జన చేశారని ఆ కథనంలో పేర్కొన్నారు.
కాగా, పుతిన్ గత నెలలో క్యూబా అధ్యక్షుడు మిగూయెల్ డియాజ్ కానెల్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో పుతిన్ చేతులు వణుకుతూ కనిపించాయని, అంతేకాదు పుతిన్ చేతులు ఊదా రంగులోకి మారాయని బ్రిటన్ కు చెందిన 'ఎక్స్ ప్రెస్' తన కథనంలో వెల్లడించింది.