Revanth Reddy: నా బిడ్డ లగ్నపత్రికకు కూడా వెళ్లకుండా చేశారు.. ఇప్పుడు ఆయన బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చింది: రేవంత్ రెడ్డి
- ఆనాడు తనను అన్యాయంగా జైల్లో పెట్టించారన్న రేవంత్
- మా ఉసురు కేసీఆర్ కు తగులుతుందని వ్యాఖ్య
- 37 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొన్నారని విమర్శ
ఆనాడు తనను అన్యాయంగా జైల్లో పెట్టించారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జైల్లో పెట్టి, తన బిడ్డ లగ్నపత్రికకు కూడా వెళ్లకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాపం ఊరికే పోలేదని... ఈరోజు కేసీఆర్ బిడ్డ కవిత ఇంటికి సీబీఐ వచ్చిందని అన్నారు. ఈ నొప్పి ఏమిటో ఇప్పుడు నీకు తెలుస్తోందా? అని ప్రశ్నించారు. మా ఉరుసు నీకు తగిలి తీరుతుందని అన్నారు.
మా తాండూర్ ఎమ్మెల్యేని కొనుగోలు చేసింది కేసీఆర్ కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కేసీఆరే అని చెప్పారు. కాంగ్రెస్ ను లేకుండా చేస్తే ఆయన కొడుకు కేటీఆర్ కు తిరుగుండదని కేసీఆర్ భావిస్తున్నాడని... అందుకే ఆవులాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని అన్నారు. కేసీఆర్ కి కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగులుతుందని... టీఆర్ఎస్ చీలిపోతుందని... ఇది చూసి కేసీఆర్ కుంగిపోతారని చెప్పారు.