North Korea: మరోమారు విరుచుకుపడిన ఉత్తర కొరియా.. ఈసారి శతఘ్నులతో వీరంగం!

North Korea fires over 100 artillery rounds in military drill Says South Korea

  • దక్షిణ కొరియా సరిహద్దులో మిలిటరీ డ్రిల్స్
  • 130 రౌండ్లకు పైగా పేల్చిన వైనం
  • వార్నింగ్ కమ్యూనికేషన్స్ పంపిన సౌత్ కొరియా

ఆంక్షలు, హెచ్చరికలు ఉత్తర కొరియాను ఏమీ చేయలేకపోతున్నాయి. ఇప్పటికే బోల్డన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ ఏమాత్రం చలించని నార్త్ కొరియాపై ఇటీవల అమెరికా, దాని మిత్రదేశాలు మరోమారు ఆంక్షలు విధించాయి. అయినా తగ్గేదే లేదంటూ తాజాగా శతఘ్నులతో విరుచుకుపడింది. తూర్పు, పశ్చిమ తీరాల నుంచి 130 రౌండ్లకు పైగా ఫిరంగి గుండ్లను సముద్రంలోకి పేల్చింది. దక్షిణ కొరియా సరిహద్దుకు సమీపంలో చేపట్టిన మిలటరీ డ్రిల్స్‌లో భాగంగా వీటిని పేల్చింది. 

ఈ మేరకు దక్షిణ కొరియా మిలిటరీ పేర్కొంది. ఉత్తర కొరియా పేల్చిన వాటిలో కొన్ని సముద్ర సరిహద్దు సమీపంలోని బఫర్ జోన్‌లో పడినట్టు పేర్కొంది. ఇది 2018 నాటి సమగ్ర సైనిక ఒప్పందం (సీఎంఏ)ను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. నార్త్ కొరియా ఫైరింగ్‌పై పలు వార్నింగ్ కమ్యూనికేషన్స్ పంపినట్టు పేర్కొంది. తాజా ఘటనపై నార్త్ కొరియా ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.

ఉత్తర కొరియా ఈ ఏడాది చేసినన్ని క్షిపణి పరీక్షలు గతంలో ఎన్నడూ చేయలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 60కి పైగా క్షిపణులను పరీక్షించింది. నవంబరు 10న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని కూడా పరీక్షించింది. దాని వరుస పరీక్షలు చూస్తుంటే 2017లో అది నిలిపివేసిన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించబోతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News