fifa: దోహాలోని ఈ స్టేడియాన్ని కూల్చేస్తారట.. వీడియో ఇదిగో!
- ఫిఫా వరల్డ్ కప్ కోసమే స్టేడియం నిర్మాణం
- పోటీలు పూర్తవడంతో కూల్చేస్తామంటున్న ఖతార్
- 974 షిప్పింగ్ కంటెయినర్లతో ప్రత్యేకంగా డిజైన్
రోజులు, నెలల తరబడి ఎంతో శ్రమించి నిర్మించిన స్టేడియం అది.. పట్టుమని ఐదు మ్యాచ్ లు జరిగాయో లేదో స్టేడియంను కూల్చేస్తామని అంటున్నారు అధికారులు. రీసైకిల్ చేసిన షిప్పింగ్ కంటెయినర్లతో కట్టిన ఈ స్టేడియం అందాలు చివరిసారిగా చూడండంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిఫా వరల్డ్ కప్ పోటీల కోసం దోహాలో సముద్రపు ఒడ్డున ఈ ప్రత్యేకమైన స్టేడియంను ఖతార్ ప్రభుత్వం నిర్మించింది. ఈ స్టేడియం నిర్మాణంలో 974 షిప్పింగ్ కంటెయినర్లను ఉపయోగించారు. స్టేడియం పేరు.. ఖతార్ ఐఎస్ డీ కోడ్ రెండూ 974 కావడం విశేషం!
ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ ప్రభుత్వం నిర్మించిన ఏడు స్టేడియాలలో ఇదొకటి. ఎయిర్ కండిషనింగ్ చేయని స్టేడియం కూడా ఇదొక్కటే. అందుకే సాయంత్రంపూట జరిగే మ్యాచ్ లను మాత్రమే ఈ స్టేడియంలో నిర్వహించారు. ఇందులో 44 వేలమంది ప్రేక్షకులు కూచునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్ లు జరిగాయి. సోమవారం బ్రెజిల్, సౌత్ కొరియాల మధ్య జరిగిన మ్యాచ్ ఈ స్టేడియానికి చివరి మ్యాచ్.. ఫిఫా వరల్డ్ కప్ ముగియగానే ఈ స్టేడియాన్ని కూల్చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.