Canara Bank: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కెనరా బ్యాంక్
- క్లాసిక్ డెబిట్ కార్డులతో ఏటీఎం నుంచి రూ.75వేల వరకు విత్ డ్రా
- పీవోఎస్/ఈ కామర్స్ చెల్లింపుల పరిమితి రూ.2 లక్షలకు పెంపు
- ప్లాటినం, బిజినెస్ కార్డు దారులకు మరింత వెసులుబాటు
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంకు ఆదర్శనీయమైన నిర్ణయాలు తీసుకుంది. కస్టమర్లకు అనుకూలమైన చర్యలు తీసుకుంది. డెబిట్ కార్డులపై రోజువారీ లావాదేవీల పరిమితిని పెంచింది. ఏటీఎంల్లో నగదు ఉపసంహరణతోపాటు, పీవోఎస్ చెల్లింపుల పరంగానూ పరిమితులు పెంచింది. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ఇప్పటి వరకు డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి రూ.40,000 వరకు నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ, ఇకపై ఇది రూ.75,000గా అమల్లో ఉంటుంది. డెబిట్ కార్డుతో పీవోఎస్ మెషిన్లు, ఈ కామర్స్ పోర్టళ్లలో ఒక రోజులో రూ.లక్ష వరకు చెల్లింపులు చేసే సౌకర్యం ఉండగా, దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ/కాంటాక్ట్ లెస్) చెల్లింపుల పరిమితి ఒక రోజులో రూ.25వేలుగా ఉంటే, ఇకమీదటా ఇదే పరిమితి కొనసాగుతుంది. క్లాసిక్ డెబిట్ కార్డులకు ఈ పరిమితులు అమలవుతాయి. ఇక ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ డెబిట్ కార్డులతో ఒక రోజులో ఏటీఎం నుంచి రూ.లక్షను ఉపసంహరించుకోవచ్చు. పీవోఎస్/ఈ కామర్స్ చెల్లింపుల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగింది.