India: గాయాన్ని సైతం లెక్కచేయకుండా.. ప్రపంచ చాంపియన్ షిప్లో పతకం నెగ్గిన మీరాబాయి చాను
- రజతం సాధించిన భారత మేటి క్రీడాకారిణి
- మణికట్టు గాయంతోనే బరిలో నిలిచిన వైనం
- 2017లో ఇదే టోర్నీలో స్వర్ణం నెగ్గిన చాను
భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన ప్రతిభ చాటుకుంది. ఒలింపిక్స్ లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన చాను తాజాగా ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించింది. చేతికి గాయం అయినా లెక్క చేయకుండా బరువులు ఎత్తి రజతం రాబట్టింది. బుధవారం జరిగిన 49 కిలోల విభాగంలో పోటీ పడ్డ చాను మొత్తం 200 కిలోల బరువెత్తి రెండో స్థానం సాధించింది. స్నాచ్ లో 87 కిలోలు మోసిన ఆమె క్లీన్ అండ్ జెర్క్ లో 113 కిలోల బరువెత్తింది. 206 కిలోల బరువెత్తిన చైనా లిఫ్టర్ జియాంగ్ హుయిహువా మొదటి స్థానంతో స్వర్ణం సాధించింది.
2017 ప్రపంచ చాంపియన్షిప్ లో స్వర్ణం నెగ్గిన చాను ఈ సారి కూడా బంగారు పతకంపై గురి పెట్టింది. కానీ, సెప్టెంబర్ లో జరిగిన శిక్షణ శిబిరంలో చాను మణికట్టుకు గాయమైంది. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ ప్రపంచ చాంపియన్ షిప్ లో బరిలోకి దిగిన తను నొప్పిని భరిస్తూనే బరువులు ఎత్తింది. అయినా రజత పతకం సాధించడం విశేషం.