Rohit Sharma: రెండో వన్డేలో రోహిత్ శర్మ బొటనవేలికి గాయం... స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలింపు
- నేడు భారత్, బంగ్లాదేశ్ రెండో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
- రెండో ఓవర్లోనే గాయపడిన రోహిత్
- క్యాచ్ పట్టే యత్నంలో గాయం
బంగ్లాదేశ్ తో రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ సెకండ్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ బంతిని పట్టే ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ ఎడమచేతి బొటనవేలికి గాయమైంది.
బాధతో విలవిల్లాడిన రోహిత్ మైదానాన్ని వీడాడు. రోహిత్ ను పరీక్షించిన బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి వైద్య పరీక్షలు అవసరమని తేల్చింది. దాంతో, రోహిత్ ను ఢాకాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు స్కానింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా, రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 34 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. తొలి వన్డే హీరో మెహిదీ హసన్ 41, మహ్మదుల్లా 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, సిరాజ్ 2, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు.