Helium Balloon: వికారాబాద్ జిల్లాలో పొలాల్లో కూలిపోయిన వింత వస్తువు... వీడియో ఇదిగో!
- మొగిలిగుండ్ల వద్ద కలకలం
- భారీ వస్తువు పడిపోవడంతో స్థానికుల్లో భయాందోళన
- అధికారులకు సమాచారం
- హీలియం బెలూన్ అని తేల్చిన అధికారులు
- వాతావరణ అధ్యయనం కోసం ఉపయోగిస్తుంటారని వెల్లడి
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఆకాశం నుంచి పడిపోయిన ఓ వింత వస్తువు స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. చూడ్డానికి ఓ టైమ్ మెషీన్ ఆకారంలో ఉన్న ఈ వస్తువును చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
ఈ భారీ వస్తువు ఇక్కడి పొలాల్లో కూలిపోగా, రైతులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పొలాల వద్దకు చేరుకుని ఆ వస్తువును పరిశీలించిన అధికారులు అది వాతావరణ మార్పులను పరిశీలించేందుకు ప్రయోగించిన హీలియం బెలూన్ అని వెల్లడించారు.
వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం ఇలాంటి బెలూన్లను గగనతలంలోకి ప్రయోగిస్తుంటారని తెలిపారు. మొగిలిగుండ్ల వద్ద కూలిపోయిన బెలూన్ ను టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ పంపించినట్టు వెల్లడించారు.
కాగా, స్థానికులు ఆ భారీ బెలూన్ ను ఆసక్తిగా తిలకించారు. బెలూన్ చుట్టూ కెమెరాలు ఉన్నాయని, ఆ బెలూన్ లో కూర్చోవడానికి ఓ సీటు కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు.