Nara Lokesh: ఆరోపణలు చేసి పారిపోవడం ఏ1, ఏ2 లకు అలవాటే: నారా లోకేశ్
- లోకేశ్ పై స్కిల్ డెవలప్ మెంట్ అంశంలో ఆరోపణలు
- ఒక్క ఆరోపణ అయినా నిరూపించారా అంటూ లోకేశ్ ఫైర్
- మంగళగిరి నియోజకవర్గంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం
- నిడమర్రులో ఇంటింటికీ వెళ్లిన లోకేశ్
తనపైనా, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపైనా, ఆరోపణలు చేయడం, పారిపోవడం ఏ1, ఏ2 లకు అలవాటుగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ఏ ఆరోపణ అయినా నిరూపించగలిగారా? అని ప్రశ్నించారు.
మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తమ ఇళ్ల కూల్చివేతకు నోటీసులు ఇచ్చారని మహిళలు గోడు వెళ్లబోసుకోగా, న్యాయపోరాటం చేసి అండగా నిలుస్తానని లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు తనపై అనేక ఆరోపణలు చేశారని, అధికారంలోకి వచ్చి కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారని... దమ్ముంటే ఏ ఒక్క ఆరోపణ అయినా నిరూపించాలని సవాల్ విసిరారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం 24 గంటల్లో ఆధారాలు చూపాలని ఛాలెంజ్ చేస్తే పారిపోయిందని ఎద్దేవా చేశారు.
"నాడు పింక్ డైమండ్ అన్నారు, దసపల్లా భూములు కొట్టేశానన్నారు. అగ్రిగోల్డ్ నేనే చేశానన్నారు, ఫైబర్ గ్రిడ్ లోనూ ఆరోపణలు చేశారు. కానీ జగన్ రెడ్డి గ్యాంగ్ ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయింది" అని వివరించారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల అయ్యిందని, 50 మంది టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని, ఒక్క కేసు అయినా నిలబడిందా? అని నిలదీశారు. నెలకి ప్రజాధనం లక్షలు బొక్కుతున్న సాక్షి జీతగాడు సజ్జల ఏ అర్హత, ఏ హోదాతో తెలుగుదేశం నేతలపై ఆరోపణలు చేస్తున్నాడో చెప్పాలన్నారు. తాడేపల్లి కొంప నుంచి ఇచ్చే కాగితం పట్టుకుని తప్పుడు ఆరోపణలు చేసే వారందరిపైనా పరువునష్టం కేసు వేస్తానని లోకేశ్ హెచ్చరించారు.
స్టాన్ ఫోర్డ్ లో తనతోపాటు చదువుకున్న క్లాస్ మేట్స్ ఏడాదికి కోట్ల డబ్బు సంపాదిస్తున్నారని, డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ తన లక్ష్యమన్నారు. జగన్ రెడ్డి తనను చూసి వణుకుతున్నారని, అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ రెడ్డి ఒక కాపీ క్యాట్ అనీ, జయహో బీసీ అనేది టీడీపీ స్లోగన్ అని, దాన్ని కొట్టేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్న నలుగురు రెడ్లకీ బీసీలంటే కక్ష అనీ, పుంగనూరులో రాంచందర్ యాదవ్ అనే జనసేన బీసీ నేత ఇంటిని పెద్దిరెడ్డి తన రౌడీసైన్యంతో ధ్వంసం చేయించడమే దీనికి నిదర్శనమన్నారు.
జగన్ రెడ్డి సిఎం అయ్యాక.... ఇప్పటికి 24 మంది బీసీ నేతలను చంపేశారు... ఇదేనా జయహో బీసీ అంటే? అని ప్రశ్నించారు. బీసీలకు 60 కార్పొరేషన్ లు ఇచ్చాం అని చంకలు గుద్దుకుంటున్న వైసీపీ పెద్దలు ఆయా కార్పొరేషన్లకు ఇచ్చిన నిధులు మాత్రం సున్నా అని తెలిపారు. టీడీపీ డిఎన్ఎ లోనే బిసి ఉందని, బీసీల గుండెల్లో ఉండేది టీడీపీ మాత్రమేనన్నారు. వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి కల్పించే అమర్ రాజా వంటి సంస్థను పంపేశామని గొప్పగా చెప్పుకుంటున్న సజ్జలకి బుద్ధి లేదని లోకేశ్ విమర్శించారు.
పొల్యూషన్ వల్ల కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తున్నామని వైసీపీ పెద్దలు చెబుతున్నారని, అలా అయితే అతి ఎక్కువ పొల్యూషన్ ఉండే భారతీ సిమెంట్ ఫ్యాక్టరీని ముందు మూసేయించాలని డిమాండ్ చేశారు. అమర రాజా, అదానీ, జాకీ సంస్థలను పంపేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.
అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి రహస్య జీవోతో అందరినీ తొలగిస్తున్నాడని మండిపడ్డారు.