Chinese students: కెమెరాల్లో పడకుండా కోట్ కనిపెట్టిన చైనీయులు
- గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థుల బృందం ఆవిష్కరణ
- ఇన్విస్ డిఫెన్స్ గా దీనికి నామకరణం
- దీన్ని ధరిస్తే కెమెరాల్లో మనిషి శరీర భాగాలు పడవు
కెమెరాలో పడకుండా ఉండగలమా? ఇది దాదాపు అసాధ్యం. కానీ, దీన్ని సాధ్యం చేశారు చైనా విద్యార్థులు. గ్రాడ్యుయేట్ విద్యార్థుల బృందం ఒక కోట్ ను అభివృద్ధి చేసింది. దీన్ని ధరిస్తే సీసీటీవీ కెమెరాల్లో వ్యక్తి శరీర భాగాలు పడవు. కేవలం ఏదో ఒక రూపంగా, దెయ్యం మాదిరి కనిపిస్తుంది తప్పించి, ఆనవాళ్లు ఉండవు. దీనికి ‘ఇన్విస్ డిఫెన్స్’ అనే పేరు పెట్టారు.
పగలు అసాధారణ ప్యాటర్న్ లతో, రాత్రివేళ అసాధారణ వేడి సంకేతాలను విడుదల చేయడం ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా పనిచేసే కెమెరాలను బురిడీ కొట్టించడం ఈ కోట్ కు తెలుసు. చైనా, కోన్ని ఆగ్నేయాసియా దేశాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా కెమెరాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి. తాజాగా కనుగొన్న ఇన్విస్ డిఫెన్స్ కోట్ ఈ దేశాలకు సాయపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలా అంటే, ఈ టెక్నాలజీ గురించి తెలుసుకుని మరింత అభివృద్ధి చేయడం ద్వారా సమర్థవంతంగా గుర్తించే కెమెరాలను తయారు చేసుకోవచ్చు. లేదంటే ఈ ఇన్విస్ డిఫెన్స్ కోట్ పై నిషేధం విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.