Jagan: దూసుకొస్తున్న మాండూస్ తుపాను.. కలెక్టర్లకు జగన్ ఆదేశాలు

Jagan issues key orders to district collectors amid cyclone

  • శుక్రవారం అర్ధరాత్రి తీరం దాటనున్న తుపాను
  • నాలుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు జగన్ ఆదేశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి మాండూస్ గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుపాను తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి - శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఇది చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయింది. 

ఇక తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ తుపాను కారణంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నమయ్య, కడప జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లను సీఎం జగన్ అప్రమత్తం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షను నిర్వహిస్తూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తుపాను పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన ఉందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News