voter: ఓటరు నమోదుకు నేడే ఆఖరు... ఇలా నమోదు చేసుకోవచ్చు
- నవంబర్ 9న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
- కొత్త ఓటరు నమోదు, జాబితాలో సవరణకు డిసెంబర్ 8 వరకు గడువు
- అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన
స్పెషల్ సమరీ రివిజన్-2023 లో భాగంగా ఓటరు నమోదుకు గడువు గురువారం (నేడు)తో ముగుస్తోంది. ఎన్నికల సంఘం నవంబర్ 9న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు తప్పులను సవరించుకొనేందుకు, నూతన ఓటరు నమోదు కొరకు డిసెంబర్ 8 వరకు గడువు ఇచ్చింది. ఓటరు జాబితాలో గల ఇంటి చిరునామా సవరణ, ఇతర నియోజక వర్గాలకు బదిలీ, ఓటరు గుర్తింపు కార్డులో తప్పుల సవరణ, దివ్యాంగుల గుర్తింపు కోసం అభ్యర్థన, అభ్యంతరాల కోసం ఈ వెలుసుబాటు కల్పించింది.
నేటితో ఈ గడువు ముగుస్తుంది. కొత్త ఓటరు నమోదు, మార్పులకు www.nvsp.in వెబ్ సైట్, voter helpline అనే యాప్ ను ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా, భారత ఎన్నికల కమిషన్ ఏడాదికి 4 అర్హత తేదీల (జనవరి 1 ,ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1) నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వారు ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు జాబితాలో పేరున్న వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు.