Atchannaidu: చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు దుర్మార్గం: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on NTR statue lifting in Chintalapudi

  • ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు
  • జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్న అచ్చెన్న  
  • ఎన్టీఆర్ కు పదేపదే అవమానం జరుగుతోందని ఆగ్రహం

జగన్ రెడ్డి అరాచక పాలనపై ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టి మరల్చేందుకే విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. 

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఎన్టీఆర్ కు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్నో అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేకచోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తూ, ధ్వంసం చేస్తూ వైసీపీ గూండాలు వికృతానందం పొందుతున్నారని మండిపడ్డారు.  

గతంలోనూ ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారని, విగ్రహాలను ధ్వంసం చేశారని అచ్చెన్నాయుడు వివరించారు."ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడిన వారిలో ఒక్కరిపైన అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్న పోలీసులు ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తున్న వారిపై, ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం?" అని ప్రశ్నించారు. 

అధికార పార్టీ వారికో న్యాయం.. మాకో న్యాయమా? వైసీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News