AAP: హిమాచల్ లో ఆప్ బోల్తా.. కొన్ని చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లు

AAP Wins No Seat In Himachal Pradesh Scores Less Than NOTA In Some Areas

  • రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ
  • మొత్తం పోలింగ్ లో 1.10 శాతం ఓట్లే సాధించిన ఆప్
  • పలు నియోజకవర్గాల్లో నోటా కంటే ఆప్ అభ్యర్థులకే తక్కువ ఓట్లు

ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో అద్భుత విజయాల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. బీజేపీ, కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారంలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కానీ, రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ విజయం సాధించలేకపోయింది. గుజరాత్ లో కొన్ని స్థానాల్లో గెలిచి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చిన కేజ్రీవాల్ పార్టీ హిమాచల్ లో మాత్రం పూర్తిగా బోల్తా కొట్టింది. అక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం పోలింగ్ లో ఆ పార్టీ 1.10 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. 

చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. డల్హౌసీ, కసుంప్టి, చోపాల్, అర్కి, చంబా, చురా తదితర నియోజకవర్గాల్లో ఆప్ కంటే ఎక్కువ మంది ఓటర్లు నోటాకే ఓటు వేశారు. హిమాచల్ అసెంబ్లీ పోలింగ్ లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం 0.60గా ఉంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఆప్ 67 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికలకు ఒక నెల ముందు పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ర్యాలీలు, రోడ్ షోలను నిర్వహించడం ద్వారా తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన ఆప్ అగ్ర నాయకత్వం తర్వాత గుజరాత్‌పై దృష్టి సారించి చివరి దశలో హిమాచల్ ను పట్టించుకోలేదు. 

రాష్ట్రంలో ప్రజలకు చేరువయ్యే ఒక మాస్ లీడర్ లేకపోవడం కార్యకర్తలను నిరుత్సాహపరిచింది. రాష్ట్రంలో పెద్దగా పేరున్న నాయకులెవరూ లేకపోవడంతో సీఎం అభ్యర్థిని ప్రకటించలేకపోయింది. దాంతో, నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అవుదామని ఆశించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది.

  • Loading...

More Telugu News