Bandi Sanjay: గుజరాత్ ఫలితాలపై కేసీఆర్ స్పందించాలి: బండి సంజయ్

Bandi Sanjay demands KCR to respond on Gujarat results
  • గుజరాత్ లో అభివృద్ధి జరగలేదని కేసీఆర్ పదేపదే అన్నారన్న సంజయ్
  • తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా
  • కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ... గుజరాత్ ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని అన్నారు. గుజరాత్ లో జరిగిన అభివృద్ధి ఏముందని కేసీఆర్ పదేపదే ప్రశ్నించారని... ఇప్పుడు గుజరాత్ ఫలితాలపై ప్రశ్నించాలని అన్నారు. అభివృద్ధి చేయకపోతే ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని ఎలా అందిస్తారని ప్రశ్నించారు.

తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన కొనసాగుతోందని... రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ పదవి నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమయిందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులతోనే అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయిందని చెప్పారు.

రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతి, అక్రమాలను బయటకు తీసేందుకు కేంద్రం మీటర్లు పెడుతుందని అన్నారు. ఏపీ, తెలంగాణ మళ్లీ కలిసిపోవాలనేదే తమ విధానమని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. పక్క రాష్ట్రంతో వైరం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ... మళ్లీ సెంటిమెంట్ ను లేవనెత్తేందుకు వైసీపీతో కలిసి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత ఉన్నారని... దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
TRS
Gujarat

More Telugu News