CPI Narayana: సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేని వ్యక్తి రెండు రాష్ట్రాలను కలుపుతాడా?: సీపీఐ నారాయణ

CPI Narayana criticizes YCP govt over Kadapa steel plant
  • కడప స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ ఉద్యమం
  • సీపీఐ రామకృష్ణ పాదయాత్ర
  • ప్రారంభించిన సీపీఐ నారాయణ
  • స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలకే పరిమితమైందని వెల్లడి
కడప స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ మలి దశ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర అగ్రనేతలు పాదయాత్ర తలపెట్టారు. సీపీఐ పాదయాత్రకు టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. కడప కలెక్టరేట్ వరకు 4 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. 

కాగా, జమ్మలమడుగు వద్ద ఉన్న ఉక్కు పరిశ్రమ శిలాఫలకం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, కడప స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు. ఏ అదానీకో, మరెవరికో అప్పగిస్తే వారైనా ఈ పరిశ్రమను పూర్తిచేస్తారని సలహా ఇచ్చారు. 

స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానిని జగన్ ఎందుకు నిధులు అడగడంలేదని నారాయణ ప్రశ్నించారు. సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయలేని వ్యక్తి రెండు రాష్ట్రాలను కలుపుతానంటూ మాయమాటలు చెబుతున్నాడని అన్నారు. ఎవరిని వంచించడానికి ఈ సమైక్యవాదం మాటలు? అంటూ నిలదీశారు. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని విమర్శించారు. ముగ్గురు సీఎంలు శంకుస్థాపన చేసినా ఏం ప్రయోజనం? అని వ్యాఖ్యానించారు. 

ఇప్పటికైనా కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు కళ్లు తెరవాలని హితవు పలికారు. ఈ నెల 13న కడప కలెక్టరేట్ వద్ద సీపీఐ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు రామకృష్ణ వెల్లడించారు.
CPI Narayana
Kadapa Steel Plant
CPI Ramakrishna
Jagan
YSRCP

More Telugu News