KCR: ఎర్రకోటపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే... బీఆర్ఎస్ నినాదం ఇదే: కేసీఆర్
- బీఆర్ఎస్ నినాదం.. అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్
- ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్న కేసీఆర్
- కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని వెల్లడి
టీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ ప్రస్థానంలో ఈరోజు కీలక పరిణామం సంభవించింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పేరు మార్చుకుని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నినాదం 'అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్ (వచ్చేది రైతు రాజ్యం)' అని తెలిపారు. ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని... అదే రోజున సభను కూడా నిర్వహిస్తామని చెప్పారు.
ఎన్నికల్లో గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదని... ప్రజలని కేసీఆర్ అన్నారు. దేశంలో మహిళా సాధికారత కోసం కొత్త విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. అదే విధంగా కొత్త పర్యావరణ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో రాబోయేది రైతుల ప్రభుత్వమేనని చెప్పారు. త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ పాలసీలను రూపొందిస్తామని తెలిపారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ తరపున కర్ణాటకలో ప్రచారాన్ని కూడా నిర్వహిస్తామని తెలిపారు. కుమారస్వామి మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.