Sathya Kumar: 2023 వేసవిలో ముందస్తు ఎన్నికలు... అందుకే జగన్ ఎన్నికల సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు: బీజేపీ నేత సత్యకుమార్

Sathya Kumar said CM Jagan thinks about early elections
  • నిన్న వైసీపీ శ్రేణులతో సీఎం జగన్ సమావేశం
  • పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం
  • 16 నెలల్లో యుద్ధం అనేది పైమాట మాత్రమేనన్న సత్యకుమార్ 
  • జగన్ మనసులో 'ముందస్తు' ఆలోచన ఉందని స్పష్టీకరణ
సీఎం జగన్ నిన్న వైసీపీ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించడం తెలిసిందే. ప్రతి 50 ఇళ్లను మ్యాపింగ్ చేస్తామని, ఆ 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు (ఒక మహిళ, ఒక పురుషుడు) ఉంటారని... గ్రామ/వార్డు సచివాలయాలకు ముగ్గురు చొప్పున కన్వీనర్లను ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ 2023 ఏప్రిల్, మే నెలల్లోనే ముందస్తు ఎన్నికలకు వెళతారని, అందుకే ఎన్నికల సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. 

పూర్తికాలం పాటు అధికారంలో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని తెలిసే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని అన్నారు. 16 నెలల్లో యుద్ధం అని జగన్ అంటుండడం కేవలం పైమాట మాత్రమేనని, ఆయన మనసులో మాత్రం ముందస్తు ఎన్నికల ఆలోచన ఉందని సత్యకుమార్ పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల కోసం అన్నిరకాల సాధనాలు సిద్ధం చేసుకుంటున్నాడని తెలిపారు. "ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు... భవిష్యత్తు కళ్ల ఎదుటే కనిపిస్తోంది" అని వివరించారు. 

పక్కా పథకం ప్రకారమే టీచర్లను ఎన్నికల విధుల నుంచి పక్కకి తప్పించారని సత్యకుమార్ ఆరోపించారు. ఇలాంటివి చేయడానికి డర్టీ ట్రిక్స్ డిపార్ట్ మెంట్ అనేది ఒకటుందని అన్నారు. దానికి హెడ్ నిన్న వ్యాఖ్యలు చేసిన వ్యక్తి (సజ్జల) అని విమర్శించారు. వీళ్లు నెలకు అప్పనంగా రూ.10 లక్షలు ప్రజాధనం బొక్కుతూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను తీసుకెళ్లి తెలంగాణలో విలీనం చేయడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. నిన్న బీజేపీ గుజరాత్ లో ఘనవిజయం సాధించడంతో, ప్రజల దృష్టిని బీజేపీ విజయం పైనుంచి మరల్చడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సత్యకుమార్ ఆరోపించారు.
Sathya Kumar
Jagan
Early Elections
BJP
YSRCP

More Telugu News