Cyclone Mandous: తీరం దాటిన తుపాను.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు

cyclone mandous updates heavy to heavy rains expected in nellore and tirupati
  • మహాబలిపురం సమీపంలో తీరం దాటిన తుపాను
  • నేటి మధ్యాహ్నానికి మరింత బలహీనపడనున్న ‘మాండూస్’
  • నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
  • చెన్నై నుంచి నడవాల్సిన 27 విమానాల రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మాండూస్’ గత అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. నిన్న ఉదయమే బలహీనపడిన తుపాను నేటి ఉదయం మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. మధ్యాహ్నానికి ఇది మరింత బలహీనపడుతుందని పేర్కొంది. 

ఇక తుపాను ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా చిరు జల్లులతో ముసురు వాతావవరణం నెలకొనగా, చాలాచోట్ల చలిగాలులు జనాలను భయపెట్టాయి. అలాగే, తీరం వెంబడి గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కోస్తా, రాయలసీమల్లోని పలు చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో అత్యధికంగా 125.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నేడు అతి భారీ వర్షాలు
దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. 

మరోపక్క, తుపాను ప్రభావంతో తమిళనాడులోని కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతోపాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరో 26 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. పెనుగాలుల కారణంగా చెన్నైలో చెట్లు విరిగాయి. చెన్నై నుంచి నడవాల్సిన 27 విమానాలు నిన్న రద్దయ్యాయి. చెన్నైతోపాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే, వర్షం కారణంగా నిన్న పూణె-రేణిగుంట-హైదరాబాద్ స్పైస్‌జెట్ విమానం రద్దయింది.
Cyclone Mandous
Andhra Pradesh
Tamil Nadu
Chennai
Nellore District
Tirupati

More Telugu News