Bandi Sanjay: బీఆర్ఎస్ సభ సంతాపసభలా ఉంది.. ఒక్కరి మొహంలోనైనా నవ్వు ఉందా?: బండి సంజయ్

Bandi Sanjay comments on BRS
  • తెలంగాణ గురించి మాట్లాడే అర్హతను కేసీఆర్ కోల్పోయారన్న సంజయ్ 
  • కర్ణాటకలో డిపాజిట్ రాని వాళ్లను సభకు పిలిపించుకున్నారని ఎద్దేవా 
  • పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదని వ్యాఖ్య 
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సంతాపసభలా ఉందని... సభకు హాజరైన ఏ ఒక్కరి ముఖంలో కూడా నవ్వు లేదని ఎద్దేవా చేశారు. పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేశారని... ఇకపై తెలంగాణ గురించి మాట్లాడే అర్హతను కేసీఆర్ కోల్పోయారని చెప్పారు. 

కర్ణాటకలో డిపాజిట్ రాని వాళ్లను సభకు పిలిపించుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని కొత్త నిర్వచనం చెప్పారు. సమైక్యవాది ఉండవల్లి అరుణ్ కుమార్ ను తీసుకొచ్చి దావత్ ఇచ్చిన కేసీఆర్... ఇప్పుడు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను లేపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిందని... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో లిక్కర్ దందా చేస్తుందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బిడ్డ లిక్కర్ స్కామ్ దందాను ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే బీఆర్ఎస్ డ్రామాను కేసీఆర్ మొదలు పెట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా తయారు చేశారని మండిపడ్డారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదని అన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాధినేతలు కుట్రలతో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఏమీ సాధించలేని కేసీఆర్... జాతీయ స్థాయిలో ఏం సాధిస్తారని ఎద్దేవా చేశారు.
Bandi Sanjay
BJP
KCR
TRS
BRS

More Telugu News