RGUKT: ఉద్యోగాల కోసం చూడడం కాదు.. పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి!: కేటీఆర్
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ పిలుపు
- వర్శిటీ 5వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి
- హాజరైన మంత్రులు సబిత, ఇంద్రకరణ్ రెడ్డి, వర్శిటీ వీసీ ప్రొ.వెంకటరమణ
- సోలార్ ప్లాంట్, 24 తరగతి గదులను ప్రారంభించిన కేటీఆర్
- విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు అందజేసిన మంత్రి
బాసర రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) లో చదువుకున్న విద్యార్థులు అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. వర్శిటీలో చదివిన విద్యార్థులు అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
శనివారం యూనివర్శిటీలో జరిగిన 5వ స్నాతకోత్సవంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకటరమణలతో పాటు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్టల్ బిల్డింగ్ పైన ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ను, కొత్తగా కట్టిన 24 తరగతి గదులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఉన్నత ఉద్యోగం సాధించాలనుకోవడం సరే కానీ మరో పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని, కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచించాలని విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు. తన ప్రసంగంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన టీహబ్ ను ప్రస్తావించిన మంత్రి.. బిల్డింగ్ కట్టినపుడు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని గుర్తుచేశారు.
అయితే, ఇటీవల అంతరిక్షంలోకి పంపిన తొలి రాకెట్ ను తయారుచేసిన ‘స్కైరూట్’ కంపెనీ తొలుత టీహబ్ లోనే మొదలైందని చెప్పారు. ధృవ స్పేస్ కంపెనీ కూడా టీహబ్ లోనే పురుడు పోసుకుందని మంత్రి వివరించారు. ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచించి, స్టార్టప్ లు ప్రారంభించాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.
గతంలో హామీ ఇచ్చినట్లుగా యూనివర్శిటీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. లాంఛనంగా కొంతమంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలోనే అందజేస్తామని, మిగతా వారికి ఒకటి రెండు రోజుల్లో అందిస్తామని చెప్పారు. ఇందుకోసం మొత్తం 2,200 ల్యాప్ టాప్ లు, 1500 డెస్క్ టాప్ లు తెప్పించినట్లు మంత్రి వివరించారు. కొత్త ఆడిటోరియం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
విద్యార్థులకు అవసరమైన సదుపాయలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. యూనివర్శిటీలో దాదాపు 70 శాతం మంది అమ్మాయిలేనన్న మంత్రి కేటీఆర్.. వారికోసం ప్రత్యేకంగా పది పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ పూర్వవిద్యార్థులు 576 మంది పట్టాలు అందుకున్నారు.