Vidadala Rajini: ప్రతిదానికీ చంద్రబాబు విమర్శిస్తున్నారు: ఏపీ మంత్రి విడదల రజని
- బీసీలను చంద్రబాబు మోసం చేశారన్న రజని
- బీసీల కోసం వైసీపీ ప్రభుత్వం రూ. 1.63 లక్షల కోట్లను ఖర్చు చేసిందని వెల్లడి
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరణ
బీసీలను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఏపీ మంత్రి విడదల రజని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 19 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో బీసీలకు రూ. 1.63 లక్షల కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు.
బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే భావించారని.. వారిని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారని చెప్పారు. బీసీల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని... వారి ఉన్నతి కోసం ఎన్నో సంక్షేమ ఫథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిదానికీ ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
మంగళగిరిలో త్వరలోనే ఎయిమ్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని రజని చెప్పారు. దీనివల్ల బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే వీలు కలుగుతుందని చెప్పారు. ఎయిమ్స్ కు నీటి సమస్య లేదని... విజయవాడ మున్సిపల్ కమిషనరేట్, తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి మూడు లక్షల లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.