Virat Kohli: మూడో వన్డేలో బంగ్లా బౌలర్లకు పట్టపగలే చుక్కలు... విరాట్ కోహ్లీ సెంచరీ
- ఛట్టోగ్రామ్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
- టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన బంగ్లాదేశ్
- ఇషాన్ కిషన్ ఊచకోత.. 131 బంతుల్లో 210 పరుగులు
- 91 బంతుల్లో 113 పరుగులు చేసిన కోహ్లీ
బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ పరుగుల సునామీ సృష్టించారు. బంగ్లా బౌలింగ్ ను ఊచకోత కోస్తూ ఇషాన్ కిషన్ 131 బంతుల్లోనే 210 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ సైతం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 85 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు.
కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేసిన అనంతరం షకీబ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. మెహిదీ హసన్ బౌలింగ్ లో ఆరంభంలోనే అవుటయ్యే అవకాశాన్ని తప్పించుకున్న కోహ్లీ... ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కళాత్మక ఆటతీరుతో బంగ్లా బౌలింగ్ దాడులను తుత్తునియలు చేశాడు. తన కెరీర్ లో 44వ వన్డే సెంచరీని సాధించాడు.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 42 ఓవర్లలో 5 వికెట్లకు 346 పరుగులు కాగా... వాషింగ్టన్ సుందర్ , అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు.