Teachers: ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు... మార్గదర్శకాలు జారీ

Guidelines for teachers transfers in AP
  • డిసెంబరు 12 నుంచి జనవరి 12 వరకు బదిలీలు
  • ఐదేళ్లు పూర్తి చేసుకున్న గ్రేడ్-2 హెడ్మాస్టర్లకు బదిలీలు
  • ఎస్జీటీలకు సర్వీసుతో సంబంధం లేకుండా బదిలీలు
  • ఆన్ లైన్ దరఖాస్తు, వెబ్ కౌన్సిలింగ్ విధానం అమలు
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ షురూ అయింది. డిసెంబరు 12 నుంచి జనవరి 12 వరకు నెలరోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. 

జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లోని గ్రేడ్-2 హెడ్మాస్టర్లు కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, సాధారణ ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని పేర్కొంది. బదిలీల ప్రక్రియను ఆన్ లైన్ దరఖాస్తు, వెబ్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహించనున్నారు. 

రాష్ట్రంలోని హైస్కూళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులకు ఉపాధ్యాయుల నియామకం కోసం ఈ బదిలీలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 10వ తరగతులకు 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా కావాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. సబ్జెక్టు టీచర్లు అందుబాటులో లేకపోతే అర్హత కలిగిన ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా నియమించనున్నారు. మిగిలిన ఎస్జీటీలను ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి బదిలీ చేయనున్నారు. 

అయితే, బదిలీల కారణంగా 2022-23 విద్యాసంవత్సరం ఒడిదుడుకులకు లోనవకుండా చూడాలని పాఠశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఉన్నతాధికారులతో రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ల బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోపు ప్రకటన విడుదల చేసి, నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
Teachers
Transfers
Andhra Pradesh

More Telugu News