Anagani Sathya Prasad: ముందుచూపు లేని అసమర్థ ప్రభుత్వంతో రైతాంగానికి ఇబ్బందులు: అనగాని సత్యప్రసాద్
- ఏపీలో మాండూస్ ప్రభావం
- అనేక జిల్లాల్లో భారీ వర్షాలు
- పంట పొలాల్లో భారీగా నీరు
- రైతులను వర్షాలు నిండా ముంచాయన్న అనగాని
- ప్రభుత్వం నుంచి కనీస సాయం అందడంలేదని విమర్శలు
లక్షల రూపాయలతో పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతుల్ని వర్షాలు నిండా ముంచాయని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే అన్నదాతలు నష్టపోయారని ఆరోపించారు. ఓ వైపు పెట్టిన పెట్టుబడి గుదిబండగా మారగా... మరోవైపు ప్రభుత్వం నుండి కనీస సహాయం అందకపోవటం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని అనగాని విమర్శించారు.
"జగన్ రెడ్డి రైతులన్నా, రైతు సమస్యలన్నా లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి ఈ ముఖ్యమంత్రికి గుర్తులేదేమో. పంటలు వేసే ముందే ధరలు ప్రకటిస్తామన్నారు. ఎక్కడైనా క్షేత్రస్థాయిలో పర్యటించి ధరలు నిర్ణయించారా?
ప్రకాశం, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి, పత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణా జిల్లాలో ఉద్యాన పంటలు నీటమునిగాయి. రైతులు వర్షాలు, వరదలతో పంట నష్టపోయి కన్నీళ్లలో ఉంటే జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ వదలి బయటకు రావటం లేదు.
మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి పేకాట క్లబ్బులు, కల్తీ మద్యం వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేయలేక వరిసాగు చేయొద్దని మంత్రి వ్యాఖ్యానించడం చేతకానితనానికి నిదర్శనం. ఎమ్మెల్యేలు ఎవరి దందాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత?
వైసీపీ పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లేక రోడ్డుపైనే పారబోస్తున్నారు. ఇప్పుడు తుఫాన్ తో మరింత నష్టపోయారు. వరి, మిరప, మొక్కజొన్న, వేరుశనగ సాగు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కోత కోసి వరి ధాన్యాన్ని ఆరబోసుకున్నారు, మరి కొన్ని చోట్ల కోతకు సిద్ధంగా ఉన్నా వర్షాలతో పంటనేల వాలింది. ముఖ్యమంత్రి చెప్పే గణాంకాలు, వాస్తవాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు సమకూర్చటం దగ్గర నుంచి అన్నదాతలకు అన్నీ సమస్యలే.
టీడీపీ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాటాలు, లోడింగ్, హమాలీ ఛార్జీలు ప్రభుత్వమే భరించేది. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అవసరమైన పరదాలు కూడా టీడీపీ ప్రభుత్వం అందించింది. కానీ వైసీపీ వచ్చాక అన్నీ ఆపేశారు. 175కు 175 సీట్లని అరవడం కాదు... కనీసం 175 మంది రైతుల్నైనా ఆదుకోండి. పంట కొనుగోళ్ల ప్రక్రియ టీడీపీ హయాంలో 3 దశల్లో పూర్తైతే... నేడు జగన్ రెడ్డి 18 దశలు విధించారు" అని విమర్శనాస్త్రాలు సంధించారు.