KCR: నేడు ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్.. రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత!

KCR to go to Delhi today

  • ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
  • రెండు రోజుల పాటు రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్న సీఎం
  • 14న బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశ రాజధాని హస్తినకు పయనమవుతున్నారు. ఈ నెల 9న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో... 14న పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ రాజశ్యామల యాగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగాలనే అభీష్టంతో సర్దార్ పటేల్ రోడ్ లోని పార్టీ తాత్కాలిక కార్యాలయంలో యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో కేసీఆర్ పాల్గొంటారు. 

కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువనే విషయం తెలిసిందే. సీఎం అయిన తర్వాత ఆయన చండీయాగాన్ని నిర్వహించారు. రెండోసారి ఎన్నికలకు వెళ్లే ముందు... టీఆర్ఎస్ విజయం కోసం రాజశ్యామల యాగాన్ని నిర్వహించడం జరిగింది. రెండోసారి సీఎం అయిన తర్వాత సహస్ర మహా చండీయాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ విజయం సాధించాలనే కోరికతో ఢిల్లీలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించబోతున్నారు. 

మరోవైపు, తన ఢిల్లీ పర్యటనలో ఐదు రోజుల పాటు కేసీఆర్ అక్కడే మకాం వేయనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, దళితులు, ఓబీసీ సంఘాల నేతలతో చర్చించి, బీఆర్ఎస్ కు వారి మద్దతును కోరనున్నారు. రిటైర్డ్ ఆలిండియా సర్వీస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులతో ఈ రాత్రి సమావేశం కానున్నట్టు సమాచారం. 14వ తేదీన బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. 15వ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మాణంలో ఉన్న పార్టీ శాశ్వత కార్యాలయానికి సంబంధించిన పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు.

  • Loading...

More Telugu News