kohli record: సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. పాక్ ప్లేయర్ అక్కసు!
- దేశానికి కప్పులు అందించాలని ఎద్దేవా చేసిన పాక్ మాజీ కెప్టెన్
- కోహ్లీ రికార్డు కోసం అభిమానులు ఎదురుచూడట్లేదని వ్యాఖ్య
- వన్డేల్లో 44 సెంచరీలు పూర్తిచేసిన విరాట్ కోహ్లీ
- 49 సెంచరీలతో అగ్రస్థానంలో వున్న సచిన్
బంగ్లాదేశ్ తో శనివారం నాటి మ్యాచ్ లో చేసిన సెంచరీ విరాట్ కోహ్లీకి 44వ సెంచరీ.. ఈ సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లలో కోహ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ ను కోహ్లీ అధిగమించాడు. వన్డేల్లో 49 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నారు. సచిన్ కు కేవలం ఐదు సెంచరీల దూరంలో ఉన్న కోహ్లీ.. త్వరలోనే ఆ రికార్డును దాటేస్తాడని కోహ్లీ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ రికార్డుల వ్యవహారంపై జరుగుతున్న చర్చలో పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ నెగెటివ్ గా స్పందించారు. భారత ఆటగాళ్లపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు.
భారత క్రికెట్ అభిమానులకు ఇప్పుడు కావాల్సింది కోహ్లీ రికార్డులు కాదని, ట్రోఫీలని రషీద్ చెప్పారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ వంద కాకుంటే రెండొందల సెంచరీలు చేయనివ్వండి కానీ ఇప్పుడు ఇండియాకు ప్రస్తుతం కావాల్సింది కప్పులేనని స్పష్టం చేశారు. ‘ఆసియా కప్ పోయింది, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచ కప్, చివరి రెండు T20 ప్రపంచ కప్‌లు కూడా పోయాయి. 100 సెంచరీలకు దానికంటూ ప్రత్యేక స్థానం ఉంది. కానీ భారతదేశం, భారత క్రికెట్ బోర్డు ఐసీసీ టైటిల్ గెలవాలి’ అని రషీద్ చెప్పారు.