Hyderabad: 16 ఏళ్లకే పీజీ డిగ్రీ అందుకున్న నైనా జైస్వాల్ సోదరుడు
- ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ
- 14 ఏళ్లకే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో డిగ్రీ పట్టా
- 9 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన అగస్త్య జైస్వాల్
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ చిన్న తమ్ముడు అగస్త్య జైస్వాల్ ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 16 ఏళ్లకే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. చివరి సంవత్సరం పరీక్షలను ఫస్ట్ డివిజన్ తో పూర్తి చేశాడు. భారత్ లో మాస్టర్ డిగ్రీ అందుకున్న అతి చిన్న వాడు ఇతడే. ఇక 14 ఏళ్ల వయసులో 2020లో అగస్త్య జైస్వాల్ డిగ్రీ పూర్తి చేసి భారత్ లోనే అతి చిన్న వయసులో డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రికార్డు నమోదు చేశాడు. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజమ్ లో అతడు డిగ్రీ చదివాడు. 9 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన రికార్డు కూడా అతడి పేరిట ఉంది.
తన తల్లిదండ్రులు, టీచర్ల మద్దతుతోనే తనకు ఇవి సాధ్యమైనట్టు అగస్త్య తెలిపాడు. తన తండ్రి అశ్వని కుమార్ జైస్వాల్, తల్లి భాగ్యలక్ష్మి జైస్వాల్ మద్దతు, శిక్షణతో సవాళ్లను అధిగమించినట్టు చెప్పాడు. అగస్త్య ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలను కేవలం 1.72 సెకన్లలోనే టైప్ చేయగలడు. రెండు చేతులతోనూ చక్కగా రాస్తాడు. జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ప్లేయర్. మోటివేషనల్ స్పీకర్ కూడా.