Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు, దత్తపుత్రుడికి పిచ్చి ఏ స్థాయిలో ఎక్కిందో అర్థమవుతోంది: సజ్జల
- ట్రాఫిక్ ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు మీటింగ్ లు పెడుతున్నారన్న సజ్జల
- పవన్ వాహనాల టాప్ ఎక్కి ప్రయాణించారని విమర్శలు
- ఇదొక అరాచకపు బ్యాచ్ అని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రాఫిక్ ఎక్కడ ఉంటే అక్కడ చంద్రబాబు మీటింగ్ పెడుతున్నారని ఆరోపించారు. "చంద్రబాబు ఎక్కడైనా మైదానాల్లో మీటింగులు పెడుతున్నారా? ఎక్కడ ట్రాఫిక్ కనిపిస్తే అక్కడికి పోయి నిలబడుతున్నారు... అదేమని ఎవరన్నా అడిగితే నన్నే అడుగుతారా అని దబాయిస్తున్నారు" అంటూ మండిపడ్డారు. తాను ఏదనుకుంటే అదే రూల్ అని ఆయన భావిస్తున్నారని విమర్శించారు.
"సరే ఆయనను వదిలేస్తే, ఆయన ఆడించినట్టల్లా ఆడే ఆటబొమ్మ పవన్ కల్యాణ్ ఏం చేశారు? ఈ మధ్య ఇప్పటం అనే గ్రామానికి వస్తూ వాహనం టాప్ మీదకు ఎక్కి హైవేలో ప్రయాణించాడు. మాకు ఎలాంటి రూల్స్ ఉండవు అనే అరాచకపు బ్యాచ్ ఇది. ఇవాళ వీళ్లు వైసీపీని ప్రశ్నిస్తుండడం వాళ్ల సహజ గుణాన్ని బయటపెడుతోంది.
ప్రజలకు అన్నీ తెలుసు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన దత్తపుత్రుడు, ఆయన శిష్యగణం, ఆయన తమ్ముళ్లు మాట్లాడే మాటలు చూస్తే పిచ్చి ఏ స్థాయిలో ఎక్కిందో అర్థమవుతుంది. చంద్రబాబుకు మరీ పైత్యం ఎక్కువయిపోయింది. ఆయనే ఒక సైకో. ఈ విషయాన్ని జనం కూడా గుర్తించారు. తానింకా సైకోగానే ఉన్నానని ప్రతి రోజూ తన మాటల ద్వారా చాటుకుంటున్నారు. అమరావతిలో ప్రజా జీవన విధానాన్ని టీడీపీ నాశనం చేసింది. ఇక పవన్ కల్యాణ్ ని చూస్తే రాజకీయం అంటే 60 సీన్ల సినిమా అనుకుంటున్నాడు" అంటూ సజ్జల విమర్శనాస్త్రాలు సంధించారు.
కరోనా సంక్షోభం లేకపోతే పరిస్థితి బాగుండేదని అభిప్రాయపడ్డారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు మినహా మరో ఆలోచన లేదని సజ్జల స్పష్టం చేశారు.