Sushil Kumar Modi: రూ. 2 వేల నోటు బ్లాక్ మనీకి కేరాఫ్‌గా మారింది.. దానిని తొలగించండి: బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ

Phase out 2000 rupee notes BJP MP Sushil Kumar Modi demands

  • రూ. 2 వేల నోటును తీసుకురావడంలో హేతుబద్ధత లేదన్న బీజేపీ నేత
  • ఏటీఎంలలోనూ ఆ నోట్లు కనిపించడం లేదన్న సుశీల్ మోదీ
  • ఒక్కసారిగా కాకుండా దశల వారీగా తొలగించాలని డిమాండ్

రూ. 2000 కరెన్సీ నోటుతో అక్రమాలు పెరిగిపోతున్నాయని, అది బ్లాక్ మనీకి పర్యాయపదంగా మారిందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో నిన్న జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కొందరు రూ. 2 వేల నోట్లు దాచిపెట్టుకుని అక్రమాలకు వినియోగించుకుంటున్నారని అన్నారు. ఏటీఎంలలో కూడా ఈ నోట్లు కనిపించడం లేదని అన్నారు. ఈ నోట్లను తీసుకురావడంలో ఎలాంటి హేతుబద్ధత లేదని సుశీల్ కుమార్ మోదీ విమర్శించారు. కాబట్టి ఈ నోటును చెలామణి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అయితే, రూ. 2 వేల నోట్లను ఇప్పటికిప్పుడు నిలిపివేయడం కూడా సరికాదని అన్నారు. దశల వారీగా వాటిని చెలామణి నుంచి తొలగించాలని కోరారు. 2018లో యూరోపియన్ యూనియన్ 500 యూరోల కరెన్సీని నిలిపివేసిందన్నారు. సింగపూర్ కూడా 2010లో 10 వేల డాలర్ల నోట్ల జారీని నిలిపివేసిందని గుర్తు చేశారు. డ్రగ్స్, స్మగ్లింగ్, మనీలాండరింగ్, ఉగ్రవాద ఫండింగ్, పన్ను ఎగవేత వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించేందుకు మాత్రమే ఈ దేశాలు పెద్ద మొత్తంలోని కరెన్సీ నోట్లను నిషేధించాయన్నారు. భారత్ ఇప్పుడు డిజిటల్ లావాదేవీల ప్రధాన కేంద్రంగా మారిందని, పెద్దమొత్తంలో చెల్లింపులన్నీ డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయని అన్నారు. కాబట్టి రూ. 2 వేల వంటి పెద్ద కరెన్సీ నోట్ల అవసరం చాలా తక్కువ అని సుశీల్ మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News