Nellore District: రెవెన్యూ అధికారుల తీరుతో మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాలనిపిస్తోంది: మాజీ మావోయిస్టు శ్రీనివాసులు
- తన కుటుంబం భూ సమస్య ఎదుర్కొంటోందని శ్రీనివాసులు ఆవేదన
- ‘స్పందన’ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం
- మూడేళ్లుగా రైతు భరోసా సాయం అందుతోందన్న మాజీ మావోయిస్టు
- సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు
రెవెన్యూ అధికారుల తీరుతో మళ్లీ ఉద్యమ బాట పట్టాలని అనిపిస్తోందని మాజీ మావోయిస్టు పూండ్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని పార్లపల్లికి చెందిన శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాను ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశాక తన కుటుంబం భూ సమస్యను ఎదుర్కొంటోందని తెలిపారు. రెవెన్యూ అధికారుల తీరువల్లే తమకీ సమస్య వచ్చిందని వాపోయారు. కావలి ఆర్డీవో కార్యాలయంలో నిన్న నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో కార్యాలయ డిప్యూటీ తహసీల్దారు నాగలక్ష్మికి ఆయన తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడో విడత భూ పంపిణీలో భాగంగా 2012లో రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబానికి కేటాయించిన భూమిని తన తల్లి సాగు చేశారని పేర్కొన్నారు. ఆమె చనిపోయిన తర్వాత ఆ భూమిని రెవెన్యూ శాఖ వేరొకరికి కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆ భూమికి సంబంధించిన పత్రాలన్నీ తమ పేరిటే ఉన్నాయని, మూడేళ్లుగా రైతు భరోసా సాయం కూడా అందుతోందని వివరించారు. రికార్డులన్నీ పక్కాగా ఉన్నా భూహక్కు మాత్రం ఇతరుల పేరిట ఉన్నట్టు తహసీల్దార్ సైతం ధ్రువీకరించారని అన్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన తహసీల్దార్ నాగలక్ష్మి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.