Pradeep: భోజనానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడినవాడు మా నాన్న: ఏవీఎస్ తనయుడు ప్రదీప్
- తన తండ్రి తెనాలిలో పౌరోహిత్యం చేసేవాడన్న ప్రదీప్
- జర్నలిస్టుగా ఆర్ధిక ఇబ్బందులు చూశారని వ్యాఖ్య
- బ్రతకడం ఎలాగో నేర్పించారని వివరణ
తెలుగు తెరపై సందడి చేసిన కమెడియన్స్ లో ఏవీఎస్ ఒకరు. తనదైన డైలాగ్ డెలివరీతో నాన్ స్టాప్ గా నవ్వించినవారాయన. అలాంటి ఏవీఎస్ గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన తనయుడు ప్రదీప్ ప్రస్తావించాడు. "మా నాన్నగారు తెనాలిలో పౌరోహిత్యం చేశారు. ఆ తరువాత విజయవాడలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డారు" అన్నాడు.
ఆ రోజుల్లో భోజనానికి డబ్బులు లేక ఆయన ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఆకలిని మరిచిపోవడం కోసం ఆయన కిళ్లీ వేసుకోవడం నాకు ఇంకా గుర్తుంది. ఉద్యోగంతో వచ్చే జీతం సరిపోకపోవడం వలన ఆయన మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చేవారు. అలా ఒక మిమిక్రీ ప్రదర్శన ఇస్తున్నప్పుడు బాపుగారు చూడటం .. 'మిస్టర్ పెళ్ళాం' సినిమాలో ఛాన్స్ ఇవ్వడం జరిగాయి" అని చెప్పాడు.
''నైతిక విలువలు పాటిస్తూ .. ఎవరినీ మోసం చేయకుండా బ్రతకమని మా నాన్న చెప్పారు. నేను అదే పద్ధతిని పాటిస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మా నాన్న ఫొటో చూస్తూ కూర్చుంటాను. అప్పుడు ఆ సమస్య సాల్వ్ అవుతుంది. అది నా నమ్మకం అంతే" అంటూ చెప్పుకొచ్చాడు.