K Kavitha: ఏపీ ప్రజలను మేము ఎప్పుడూ తిట్టలేదు: కవిత

We never insulted AP people says Kavitha

  • జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ నే అన్న కవిత
  • బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తామని వ్యాఖ్య
  • కేసీఆర్ చెప్పిన చోట నుంచి పోటీ చేస్తానని వెల్లడి

బీజేపీకి మహిళలను కించపరచడం అలవాటేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని మోదీ అవహేళన చేశారని... తనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవహేళన చేశారని విమర్శించారు. బండి సంజయ్ బతుకమ్మను కూడా అవమానించారని, ఆయన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్రజలు బుద్ధి చెపుతారని జోస్యం చెప్పారు. 

బీఆర్ఎస్ పార్టీకి దైవశక్తి అవసరమని, అందుకే యాగాలు చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు ఉంటాయని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కానుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తామని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో తమ అధినేత కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని కవిత తెలిపారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద పోటీ చేయమంటే చేస్తానని... పోటీ చేయకపోతే, అరవింద్ ఓటమి కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఏపీ ప్రజలను తాము ఎప్పుడూ తిట్టలేదని, ఆంధ్ర నేతలను మాత్రమే విమర్శించామని అన్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో పని చేస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News