Dharma Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష విధించిన హైకోర్టు
- కోర్టు ధిక్కరణ కేసులో నెల రోజుల జైలు శిక్ష
- రూ.2 వేల జరిమానా విధింపు
- ధర్మారెడ్డి ఈ నెల 27 లోపు లొంగిపోవాలన్న హైకోర్టు
కోర్టు ధిక్కరణ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ నెల 27 లోపు ఆయన జ్యుడిషియరీ రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
టీటీడీలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు గతంలో తమ సర్వీసుల క్రమబద్ధీకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ ముగ్గురి సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోర్టు అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాలను టీటీడీ అమలు చేయడంలేదంటూ ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష, జరిమానా విధించింది.