Team India: అవుటైన తర్వాత కోపంతో ఊగిపోయిన కేఎల్ రాహుల్
- ఏడు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- ఖలీద్ అహ్మద్ బౌలింగులో రాహుల్ బౌల్డ్
- కోపాన్ని నిగ్రహించుకోలేకపోయిన కెప్టెన్
బంగ్లాదేశ్‌తో చాటోగ్రామ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 41 పరుగుల వద్ద శుభమన్ గిల్ (20) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నాలుగు పరుగుల తేడాతో కెప్టెన్ కేఎల్ రాహుల్ (22), ఆ తర్వాత మరో మూడు పరుగులు జోడించాక విరాట్ కోహ్లీ (1) పెవిలియన్ చేరారు. ఏడు పరుగుల తేడాతో మూడు వికెట్లు తీసిన బంగ్లాదేశ్ బౌలర్లు భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు.
ఖలీద్ అహ్మద్ ఆఫ్ స్టంప్‌కు ఆవల వేసిన బంతిని ఆఫ్ సైడ్ మీదుగా ఆడేందుకు రాహుల్ ప్రయత్నించాడు. అయితే, బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్‌కు తాకి అనూహ్యంగా స్టంప్స్‌ను గిరాటేసింది. అవుట్‌ను జీర్ణించుకోలేకపోయిన రాహుల్ కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. బ్యాట్‌ను కోపంగా తన గ్లౌజులకు కొడుతూ ఔటైన బాధను వ్యక్తం చేశాడు. ఆ వెంటనే కోహ్లీ కూడా తైజుల్ ఇస్లాం బౌలింగులో ఎల్బీ అయ్యాడు. అది అవుట్ కాదని భావించిన కోహ్లీ డీఆర్ఎస్ తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిశాయి. ఇండియా మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. పుజారా, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు.